27, డిసెంబర్ 2011, మంగళవారం

ద డర్టీ పిక్చర్ - ఒక అభిప్రాయం

మొదట గా సినిమా పేరు విషయం కొస్తే  సినిమా విడుదలయ్యాక జనం చూసి అసహ్యంతోనో, ఆదరం తోనో  దానికి పెట్టుకునే ముద్దు పేరునే సినిమా పేరు గా పెట్టి, సగం విజయం ముందే సొంతం చేసికొన్నారు. కాబట్టి మహిళలో, విమర్సకులో ప్రశ్నించే అవకాసం లేదు.  సిల్క్ స్మిత జీవిత చరిత్ర లో విద్యాబాలన్ నటించడమా, స్మిత జీవితం ధన్యమైనట్టే!!! ఇదీ మొదటివార్త చూసినపుడు కలిగిన అభిప్రాయం.    పోస్టర్స్ చూసాక, ఒక నటి జీవితాన్ని చులకన చేసారేమో అన్న సంశయం.   కాస్త కోపం కుడా వచ్చింది ఆ చిత్ర నిర్మాతలపై!!!.    కానైతే  ఎంత మందికి ఒకప్పటి నటి సిల్క్ స్మిత పై ఆమె జీవించి  ఉండగా ఇప్పుడున్నంత   అభిమానం ఉన్నదిఇప్పుడింత మంది అభిమానులు హటాత్తు గా వచ్చారా?   లేక వీళ్ళంతా మమైత్  ఖాన్,తదితరులనిని కూడా ఇంతే ప్రేమతో ఆదరిస్తున్నారా????

సినిమా చూసాక ఈ అభిప్రాయాలు పంచుకోవాలనే ఆసక్తి ఉన్నాతెలుగు బ్లాగుల్లో సిల్క్ స్మిత కో, ఏక్తా కపూర్ కో కృష్ణవంశీ , బాపు వంటి వారికి  ఉన్నంత అభిమాన దురభిమానులు లేనందువల్ల  బ్లాగ్లోకం లోని  గొప్ప సినీ విశ్లేషకులంతా మౌనం వహించారు. అదుగో అప్పుడే జగద్దాత్రి గారు ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)   అనే చాల చక్కని వ్యాసం అందించారు.  వారు స్వయం గా రచయిత్రిచక్కని ప్రమాణాలతో వారి అబిప్రాయాన్ని అందించి చివరిగా, " ఏమి మిత్రులారా నా ఆవేదనకీ అర్ధం లేదంటారా? మీకు ఈ వేదన కలగలేదంటారా?"  అని అడగారు కాని, అడగకున్నా నా సమాధానం  వారి ప్రయత్నాన్ని గౌరవించడానికి అయినా వ్రాయాలి. నా అభిప్రాయం తెలియచేయడానికి ఒక వేదిక కల్పించిన జగద్దాత్రి గారికి ధన్యవాదాలు.

అసలు ఈ సినిమా చూసే ధైర్యం చెయ్యడానికి కారణం పాసిటివ్ రివ్యూలు. అవన్నీ నూటికి నూరుపాళ్ళు నిజం అని చెప్పాలి. కాబట్టి వారికి ధన్యవాదములు. కధ ఒక వర్గాన్నిసమాజాన్ని దగ్గరగా చూపిస్తుంది. వ్యాసరచయిత జగద్దాత్రిగారు

"సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది అన్నది వాస్తవమే. " 

 అని చెప్పాక సినిమాలో సిల్క్ అన్న పేరు ఒక రిఫరెన్స్ మాత్రమె కాని, ఆ పెద్ద నటీ మణులకి కూడా కధలో చోటు ఉందనిపించక మానదు. అదే సమయం లో వారిని చులకన చేయడం నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు.

నేటి యువతకు దర్శక నిర్మాతలు ఏమి చెపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కాని సమాజం, యువత సినీ దర్శక నిర్మాతలకు ఏమి చెపుతున్నది అన్న ప్రశ్నకు కూడా భాగం ఉంది.  ఇది కేవలం డబ్బుకోసం మాత్రమె తీసిన సినిమా గా చూడబడితే, మరోకోణం లో ఇప్పడు వస్తున్న,మనం చూస్తున్న  సినిమా లన్నింటికి ఒక ఆత్మవిమర్శ గా నిలబడ గల సత్తా కూడా ఉంది.

సినిమాలో విద్య బాలన్ పాత్ర బాగానే నటించినప్పటికీ మొదట్లో ఆమె ఆలోచన ధోరణి నే అసహ్యకరంగా చూపించారు అన్నారు. ఉహూ అదే సమయంలో ఆమె ఖచ్చితత్వాన్ని కూడా చూపారు.  ఒక అభ్యంతరకరమైన ధోరణి  సమాజం లో చెప్పుకోదగ్గ శాతం యువత లో ఇప్పటికే ప్రదర్సించబడుతు ఉన్నది.  మన చుట్టూ ఇలాంటి వాతావరణానికి ఎప్పుడో అలవాటుపడిపోయామే, మరి చిత్రం గురించి ప్రశ్నించేది  ఎలా ?  

 వాల్ పోస్టర్స్ కూడా సినిమాలోవే అయినా కళాత్మకం గా ఉంటె బాగుండేది. కాని అవయినా చూడడానికి తపించిపోయిన సమాజానికి కూడా ఈ పాపం లో భాగం ఉంది. 

సినిమాలో ఒక చోట బ్లాక్ లో టికట్ కొనుక్కునే కుర్రాడితో ఈ డబ్బులకి ఆమె నీకు దొరుకుతుంది కదా అనడం చాలా అవమానంగా అనిపించింది. ఎంత వాంప్ పాత్రలో నో ఐటెం పాట లోనో నటించినప్పటికీ ఆమె శరీరం ఒక బ్లాక్ టికెట్ కొన్నంత వెలతో సమానమా ? ఇది మనసు కలచివేయ్యడం లేదా?ఇది యువతకు ఏ ప్రబోధాన్నిస్తోంది ?

హాస్టల్స్ నడిపే ఆంటీ ల గురించి, కాస్త ఎక్కువ చనువుగా మెలిగే అమ్మాయిల గురించి ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా మనసులో కలుక్కుమంటుంది. ఆ అమ్మాయి ఎంత చెడ్డ అయినా ,అనే  హక్కు వారికి లేదని అరచి చెప్పినా అర్ధం చేసికోలేని డర్టీ సమాజం కూడా మన చుట్టూనే ఉంది. 

ఇక కధ విషయానికొస్తే ఎంతమంది కూర్చుని రాసారో కానీ ఎక్కడా పొంతనే లేని కధ. ఒక రికార్డ్ డాన్సర్ జీవితం కన్న ఒక వేశ్య జీవితం కన్న అసహ్యంగా చిత్రీకరించడం బాధ కలిగించింది.

కాస్త ఖరీదైన రికార్డ్ డాన్సర్లు నేటి కధానాయికలు, అప్పటి  గ్లామర్తో కూడిన వగలమారి పడతి పాత్రలు ... కొంచెం బాధ కలిగినా అది వారి పరిస్తితులపైనే కాని, చిత్రీకరణ పై కాదేమో.
 
 ఆ అమ్మాయి పాత్ర పైన సానుభూతి కాని సాహాను భూతి కాని లేకుండా చిత్రించారు.

ఏ సహానుభూతి లేకుండానే అంతమంది వెళ్లి చూస్తున్నారా? కానైతే సహానుభూతి కేవలమే మహిళా పాత్రలచుట్టునే లేదని నా అభిప్రాయం. సినిమా లో ఉన్నా ప్రతి మగ పాత్రకు సహానుభూతి కలిగిన ప్రేక్షకులు ఉండి ఉంటారు.(ఒకటి రెండు మంచి పాత్రలు కూడా ఉన్నాయి )
ఎంతో మంది సినీ నటీమణులు ఇలా మారడానికి కారణాలు చాల ఉన్నాయి ఆర్ధిక పరమైనవి కుటిమ్బాల్ని పోషించుకోవాల్సి రావడం ఇలాంటివెన్నో. ఈ సినిమాలో అలాంటి అవసరమున్నట్టేమీ చూపించలేదు. ఇది చాల నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది అందరి మీద.ఒక విధంగా అటువంతో నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే భావిస్తున్నాను నేను.
ఏదో ఒక అవసరం చూపితే మనం జాలి పడటానికి వీలుంటుంది అంటారా? అప్పుడు మాత్రం మరోవిధమైన నెగెటివ్ ప్రభావం చూపదా? నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే ఒకవేళ వారు అవమానం గా భావించే పరిస్థితి ఉంటె.  కాస్త పెద్ద నటి పేరు తో ఈ సినిమా తీస్తే నిజం గానే అవమానం గా ఫీలయ్యాము అని నానా యాగీ చేసుండే వారు కూడా. అదయినా వారి మార్కెట్ కాపాడుకోడానికే అవుతుంది. ఈ సినిమా ఎవరి జీవితాన్ని అయినా అవమానపరిచినట్లనిపిస్తే   జగద్దాత్రి గారు , మీరే  వ్యాసం మొదటిలో కొంతమంది పెద్ద పెద్ద నటీమణుల విషయం లో కూడా ఇది నిజమే అని అభిప్రాయం చెప్పడం కూడా  ఆ కోవలోనే వస్తుందేమో అని సందేహం కలుగుతోన్నది.  

వాస్తవ జీవితం ఐనప్పుడు దాన్ని డర్టీ అనాల్సిన అవసరమేరమే ముంది. ఒక స్త్రీ జీవితంలో పడిన బాధలు డర్టీ నా ? లేక ఆ స్త్రీ బతుకు డర్టీ నా? ఏంటి దర్శకుల ఉద్దేశం. ఇది ఒక ఆడదాన్ని అత్మభిమానాన్ని దెబ్బ తీసే విధంగా ఉందనడంలో సందేహమే లేదు.

 డర్టీ అన్నది  ప్రజల అభిప్రాయం గా కూడా అనుకోవచ్చని  ఈ వ్యాసం మొదటిలో వ్రాసుకొన్నాను. ఆడదాని ఆత్మాభిమానం దాకా ఎందుకు. చిత్రంలో ప్రతి ఒక్కరు కధలోని పాత్రధారులే.  మహా నగరాల్లో కాక, మిగిలిన చోట్ల స్త్రీలకూ ఈ సినిమా చూసే అవకాశమే కలగని సందర్భం లో అక్కడి మహిళల ఆత్మాభిమానం కూడా  దెబ్బతింది మరి .  ఒక మహిళా నిర్మించిన, ఇంకొక మహిళా నటించిన సినిమా మేమెందుకు చూడకూడదు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆత్మాభిమానం మనం చూసే కోణం ని బట్టి ఉంటుంది. నిజానికి మగవారికి ఆత్మాభిమానాన్ని సవాల్ చేస్తాయి సినిమాలో ని చాలా పాత్రలు. ఆ విధం గా దర్శకుడు అభినందనీయుడా మరి

అసలు సినిమా అన్నది ఒక పరిశ్రమ అని మనం చెప్పుకోవడానికే జుగుప్స కలుగుతోంది ఎక్కడో ఒక పది శాతం తప్ప సినిమాలన్నీ ఎక్కడ ఏమి చుపిస్తున్నాయో అసలు ఆలోచిస్తున్నామా? పరిశ్రమ అంటే ఏదైనా సరే ఒక మంచిని ఉత్పత్తి చేసేదిఅలాంటి మంచి ఏదైనా మనం సినిమా పరిశ్రమ నుండి ఆశించా గాలుగుతున్నమా. ప్రతి స్థాయి లోను రాజకీయాలు కక్షలూ ఫాక్షన్లు హింసలు వీటన్నిటితో బాటు ఒక స్త్రీ ఆమె హీరోయిన్ అయినా సరే ఓకే గొప్ప వారి అమ్మాయి అయినా అత్యంత పొదుపుగా బట్టలు వేసుకోవడం లాంటి వికృత వేషాలు చూపించడం. లేదా ఆ పిల్లాడు ఆమె ప్రేమించాక పోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ చూసి భగ్న ప్రేమలతో (అనే భ్రమలతో) ఆసిడ్ దాడులు చేస్తున్న యువతకి ఏమని చెప్పగలము. ఎలా వారించగాలము అనిపిస్తుంది.

పది శాతం అని చాల ఎక్కువ చెప్పారేమో నంది. అంత కూడా కనిపించడం లేదు.  మార్పు కోసం ఆరాటం సమాజం నుండి రావాలి, తమిళ సినీపరిశ్రమ ఇంకా పరిశ్రమ గానే మనగలగడానికి అక్కడి ప్రజలే కారణం కాదా. హీరోయిన్ పైన ఆధారపడి బ్రతుకుతున్న సినీపరిశ్రమ ని, ప్రేక్షకులని కలిపి వెలివెయ్యాలి.  

కేవలం ధనార్జన తప్ప మానవ జీవన మర్యాదలు కూడా పాటించకుండా ఒక సినిమా తీయడం దానికి ఎగేసుకుంటూ కుర్రాళ్ళందరూ వెళ్లి చూడటంఅందుకు కొందరు విమర్శకులు చాల వాస్తవిక మైన ది అంటూ మెప్పులు కురిపించడం ఇదంతా ఒక ఫాబ్రికేటేడ్ గా కావాలని అల్లిన వల లా అనిపించడం లేదా ప్రేక్షకులకు. వాస్తవికంగా అయితే ఒక జీవితాన్ని యధాతధంగా తీసి చూపండి మీ క్రూరపు మసాలాలన్నీ ఎందుకు కూరుతారు?,

జీవన మర్యాదలు వ్యాపారాల్లో (అది ఏ వ్యాపారం కానివ్వండి) నేతి బీరకాయ చందమ యినాయి. కుర్రాళ్ళు మాత్రమె చూడడం లేదు. సినిమా బాగుందని విద్యాధికుల  మన్నన కూడా పొందిన  సినిమా ఇటీవలి కాలం లో 'డర్టీ పిక్చర్' అయినందుకు కాస్తంత సంతోషమే. ఎందుకంటే మిగిలినవాటి కన్నా మెరుగ్గానే అనిపిస్తున్నది మరి.ఇకముందు వచ్చే సినిమాలలో గ్లామర్ పై ఆధారపడే కధానాయిక పాత్ర, విద్యాబాలన్ తో పోల్చబడి ,వెల వెల బోతాయని నా నమ్మిక. కాని ఎవరో వ్రాసిన ''రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ'' పాటలా, ఈ సినిమాలు మగప్రేక్షకులు ఇంతే అని సరిపుచ్చుకోవలసి వస్తుందేమో.









8, డిసెంబర్ 2011, గురువారం

మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -1

          ఆ౦టీ ఫోన్ చేసారు.  పాపను దత్తత తీసికొన్నాము చూద్దువు  రా వీలయినప్పుడు అని.  హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పాపాయిని దత్తత కాకుండా తనకే పుట్టినట్లు గా డాక్యుమెంట్ వర్క్  చేయించి  తీసికోన్నారు.  తెలిసిన రె౦డు మూడు హాస్పిటల్స్ లో చెప్పి ఉంచారట ఆడపిల్ల కావాలని , అదృష్టం ఫలి౦చి ఒక  మంచిరోజున బుజ్జి పాపాయి వాళ్ళ జీవితాలలోకి వచ్చేసింది. పాప అసలు పేరెంట్స్ ఎవరో వీళ్ళకి తెలీదు , వీళ్ళు కూడా వాళ్లకి తెలిదు.

ఎందుకు పిల్లలని రహస్యం గా దత్తత  తీసికోవాలనుకొంటున్నారు. ఆ తల్లి సరే రహస్యం గా ఉంచాలనుకొంటే వీళ్ళకీ తప్పదనుకోవచ్చు. కాని తమకే పుట్టినట్లు రికార్డులు అవసరం అని ముందే చెప్పి ఉంచడం !!!!!  నాకు తెలిసిన కారణాలు, మొదటిది పసి పిల్లలపై ఉన్న ఆసక్తి ప్రేమ, అదే సమయం లో పసి బిడ్డ అయితే తాము వేరే అన్న భావం బిడ్డకు తెలియకుండా ఉంటుందని. ఆస్తి కి వారసులు కావాలన్న తపన. వృద్దాప్యం లో తమను కనిపెట్టుకొని ఉండేవారు కావాలన్న ఆశ!

బిడ్డని తీసికొని రాగానే అందరికీ అన్ని వివరాలు(నిజాలు) చెపుతారు. అప్పుడు  ఆ బిడ్డ  కి వినిపిస్తుందా , అర్ధం  అవుతుందా  అన్న ధీమా ఏమో . కాని ఆ బిడ్డ పెద్దయ్యాక అనిజాలు ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు. కాని ప్రస్తుత  ప్రపంచం  లో ఇది సాధ్యమా. చుట్టూ ఉన్న బోలెడు పసిపిల్లల్ని వదిలేసి ఎవరో తెలియని పసికందుని తెచ్చుకొని, అప్పటికే ఆ బిడ్డకి శత్రువుల్ని తయారు చేస్తారు.  ఎవరింట్లో వాళ్ళు ఇదీ అని మాట్లాడుకోకుండా   ఉంటారా.  బిడ్డకి నిజం తెలిస్తే బాధ పడతాడు /పడుతుంది అని మాత్రమె నిజం దాచారనుకోవడం పూర్తీ గా నిజం కుడా కాదు.

Part 2-  మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

13, నవంబర్ 2011, ఆదివారం

'మొగుడు' సినిమా ఎ౦దుకు ఆకట్టుకోలేక పోయినది?

మొదటిభాగం ఇక్కడ చూడగలరు .  రె౦డవ భాగం లో ఎ౦టర్టైన్మె౦ట్ ఉండదు, కారణాలనేకం.

౧. సాధారణం గా కృష్ణవంశీ తన సినిమాల్లో ప్రత్యేకంగా కామెడి ట్రాక్ పెట్టడు. హిరో, హిరోయిన్ మిగిలిన కారెక్టర్లు వారి వారి స్థాయి లో హాస్యాన్ని కూడా పండించాలి.

౨. రెండవ భాగం లో హాస్యానికి చోటు లేదనే చెప్పాలి. అమ్మాయి 'పెళ్లి లో తాళి విసిరి కొట్టాక' కామెడీ సీన్లు పెడితే దర్శకుడి మొకాన చెప్పులేస్తారు జనం :)  అప్పటికీ హిరోయిన్ జెలసి, ఉక్రోషం లో కాస్త హ్యుమర్ పెట్టాడనుకో౦డి. బీచి పాట కుడా బాగుందట మరి. 

దర్శకుడు సమస్యను ప్రభావ వంతం గానే చెప్పాడు ఇ౦టర్వెల్ బాంగ్ వరకు. ఒక  వైపు ఈ సంప్రదాయం ఉన్నది (ట)  కాబట్టి అర్ధం లేని లాజిక్ అనుకోడానికి లేదు.  అబ్బాయి తండ్రి మూర్ఖపు పట్టు పట్టగానే  రోజా కుడా  చక్కని సమాధానం చెపుతుంది .

మన పెళ్లి సంప్రదాయాలలో ఇరువైపులా వాదన జరిగితే అమ్మాయి వైపు వారు సర్దుకుపోవడం తప్పని సరి అన్న దురాచారం కూడా ఉంది. ;-)  అలా  మగ పెళ్లి వారు చేసిన చిన్న పొరబాటు అ౦దరి మనోభావాలు  గాయ పడి పోయే స్థితి వచ్చేస్తుంది. అమ్మాయి అతన్ని  నువ్వు నాకొద్దు అనేంత. 

ఇప్పటి సమాజం లో మేలు కోరి ము౦దుకు వచ్చే  మధ్యవర్తి భూతద్దం పెట్టినా దొరకడు(దు). మనకెందుకు వచ్చిన గొడవ అనుకునేవారు, మన మాట వింటారా అని ఆగిపోయే వారు,  మనమే రైటు వాళ్ళని అది చేద్దాం ఇది చేద్దాం అనే వారును (రెండు వైపులా ). అలాగే సినిమా లో ఈ మూడవరకం మధ్యవర్తి ఒకాయన వెళ్లి మాట్లాడగానే , అబ్బాయి తండ్రి కూడా భేషజాలకు పోయి తన డిమా౦డ్ ని చెప్పి పంపుతాడు. ఆ మధ్యవర్తి కాస్తా  (తెలిసో ,తెలియకో ) పచ్చగడ్డి వేసేస్తాడు.  ఇంకేముంది మంత్రి గారు గృహహింస కేసు లా౦టిదె వేసేస్తారు.

సాధారణం గా  గృహహింస నేరం పై కేసు పెట్టడం అమ్మాయి వాల్లకేం సరదా ఉండదు. వాళ్ళ పెయిన్ ఏమిటో కూడా తెలుస్తుంది.  సరిగా చూస్తే. ఒక వివాహం చెడిపోతే నష్టం కేసు ఓడిపోయినా వారికే కాదు. ఇద్దరిదీను , కాని పురుషాహంకార సమాజం లో దీని అవసరం తప్పని సరి. గోపి చంద్ కూడా ఆ సమాజం లో ని మనిషే , తప్పు సరి చేసికోవాల్సిన సమయం లో ఇంకో పొరపాటు చెయ్యడం వలన వచ్చిన పర్యవసానం, విడాకుల కాగితాలపై సంతకం పెట్టేస్తాడు .ఆ తరువాత తన తప్పు ను సరిదిద్దుకునే  అవకాసం వస్తుంది,  అప్పటికీ పెద్దవారి పౌరుషాలు తగ్గవు. అలా అందరిని ఒప్పించి ఒక మంచి ముగింపు ఇవ్వడమే ఈ చిత్ర కధా కమామీషునూ. 

రెండవ భాగం లో  ప్రేక్షకుల ముందు పంచాయితీ పెట్టినట్లుగా ఉంటుంది. డబ్బులు పెట్టి మరీ పక్కవాడి సంసారం గొడవ చూడాలంటే విసుగెయ్యదూ. ఫ్రీ గా అయితే పర్లేదు కాని.  ఈ సినిమాకి  టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే సమాధానం దొరకదు. ఎవరు తమని , తమ కుటుంబాలని అక్కడ ఐడెంటి ఫై చేసికోలేరు,ఇష్టపడరు  కాబట్టి.   కాకపొతే కొన్ని సంవత్సరాల తరువాత కృష్ణవంశీ వెనక్కి తిరిగి చూసుకొంటే ఈ సినిమా ఉంటుంది, ఒక తరాన్ని ప్రతిబింబిం చేందుకు. చూడటం చూడకపోవడం అన్నది ఎవరిష్టం వారిది.



9, నవంబర్ 2011, బుధవారం

కార్తీక పౌర్ణమి - వనభోజనాలు


 బ్లాగర్లు కార్తీక పౌర్ణమి సందర్భంగా అంతర్జాల వనభోజనాలు సందడి లో నా వంతుగా స్కూల్ డేస్ లో నా కార్తీక పౌర్ణమి జ్ఞాపకాలు ఇక్కడ పంచుకొన్నాను .



 "కార్తీక పౌర్ణమి   ఉపవాసాలు ఉండే వాళ్ళు పేర్లు వ్రాసుకొ౦టున్నారని తెలిసి నేను కూడా  చెప్పేసాను. కొ౦తమ౦ది ఉదయాన్నే టిఫిన్ ఏ౦టొ కనుక్కుని చెప్పేస్తాం అనేసారు. " అంటే టిఫిన్ ఇడ్లి, ఉప్మా అయితే కొ౦దరు టిఫిన్లు అయ్యే వరకు ఉపవాసం అన్నమాట. ఇంకొందరు టిఫిన్ వెజ్ బిరియాని అయితే టిఫిన్ మాత్రం తినేసి ఉపవాసం ఉ౦డొచ్చు లేదా మానెయ్యొచ్చు అన్న మీమాంస.

మా స్కూల్ హాస్టల్ లో ఇడ్లి, ఉప్మా టిఫిన్ గురి౦చి కాస్త చెప్పాలి. మ౦చిసినిమా చూడ్డానికి వెళ్తే వందా రెండొందలు అని బ్లాకులో అమ్మేవారిని చూస్తాము కదా. అలాగా ఉంటాయి మా బ్రేక్ఫాస్ట్ క్యూలు ఈ రెండు ఐటమ్స్ చేసినపుడు . కొంతమంది అమ్మాయిలు ఎక్ష్ట్రా ఇడ్లి(లు) కావాలా అని మనికి మాత్రమె వినిపించేలా దాదాపు ముందుకు వెనక్కి నాలుగైదు రవుండ్లు వేస్తారు. ఎందుకంటే ఇడ్లీలు పారేస్తే కా౦పస్ చుట్టూ పరిగేట్టిస్తారు మరి :)  మనం సాంబారు ఇడ్లి రోజు ఒకటి తీసికొందాములే అనుకున్నామా( ఆ రోజు ప్రిన్సిపాల్ గారు వస్తారని ,  ఎర్రమామ్మ సూపర్ గా సాంబారు చేస్తుంది  )  , ఇక అంతే మిగిలిన రోజులు కూడా మన్ని డిమా౦డ్ చేస్తారు పాపం ...కి ...కి.  ఒకసారి గ్రవు౦డ్ లో బిళ్ళ గన్నేరు మొక్కలు నాటడానికి ఇసకలో తవ్వుతు౦తే ఇడ్లి లు బయట పడ్డాయి. అప్పటిను౦డి డైనింగ్ హాలు బయట తినడానికి కుదిరేది కాదు. అ౦త కతుందన్న మాట.

కొత్త ప్రిన్సిపాల్ గారు వచ్చాకా పండుగలే కాక, ఇలా అన్ని ముఖ్యమైన సంప్రదాయాలను ప్రోత్సహించేవారు.  సరే ఉపవాసం ఉండేవాళ్ళు ఆవాల క్లాసులకి వెల్లఖ్ఖర లేదు కాబట్టి నేను ఖుషి  .(కొ౦చెమ్ భయం కూడా మనం చెయ్యకపోతే ఏమవ్వుద్దో అని :) ).  ముందురోజే కొబ్బరి కాయలు తెప్పించుకుంటాము  ఎలాగు.అ౦దరూ  ప్రేయర్ కి వెళ్ళగానే మేము మాత్రం నెమ్మదిగా తయారయ్యి ఎవరి 'ట్రంకు పెట్టి' లో ఉన్న దేవుడికి వాళ్ళం కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు తాగేస్తాము. కు౦చెమ్ కు౦చెం  కొబ్బరి ముక్కల ప్రసాదం ఎక్స్చేంజ్ చేసికొని కబుర్లలో పడిపోయే వాళ్లము. ఈలోగా రాజియ్య వచ్చి పాపలూ మీకేమి కావాలో వ్రాసి ఇవ్వ౦డి అని చెపుతాడు . ఉదయం కూరగాయలు తెచ్చాక ఆవాల మల్లి ఒకసారి ప్రత్యేకం గా చెరుకుపల్లి పంపిస్తారు తనని మాకోసం పువ్వులు, ప్రూట్స్ తేవడానికి.  సరే ము౦దు ఒక యాపిల్, అందరితో పాటు  అరటిపళ్ళు  చాలు అని  చెప్పేసి వస్తామా(డబ్బులు మనియ్యే మరి), మిగిలిన వాళ్ళెం వ్రాసారు అని చూసి ..హ్మ్మ్ జామ కాయలు ఒక రెండు తినాలనిపిస్తుంది . బత్తాయిలు కుడా (అసలు విష్యం బిస్కట్స్ చాకేల్ట్లు తప్ప ఇలా౦టివి మేము అడిగి తెప్పి౦చుకోవడము మామూలు రోజుల్లో కుదరదన్న మాట. ) అలా అన్ని చెప్పేసి  ఆ అంకం  పూర్తయ్యే సరికి టిఫిన్ సర్దుబాట్లు వాళ్ళు తేలిపోతారు. 

 
                                           

కా౦పస్ లో అటు ఇటు తిరిగితే పి యి టి ఊరుకోదు. కాబట్టి మళ్ళీ  డార్మిటరీ   లో చేరి కబుర్ల తో పాటు సెమి ఉపవాసాల వాళ్ళ పై జోకులు, ఒక అర కొబ్బరి చిప్ప కలిపి నమిలేస్తాము. ఇక కాస్త తీరికగా జడలు అల౦కరి౦చుకోదమ్, దాడి ఆట, ఇక పెన్ను పేపర్ పట్టుకొని ఏది కుదిరితే అవి. అంతలో  ప్రూట్స్ , పువ్వులు వచ్చేస్తాయి. మని పేరు వఛ్చినదాక ,అన్ని దొరికాయో లేదో కంగారు , కొన్నే ఉంటే మన దాకా రాకు౦డా కొన్ని అయిపోతాయి..హమ్మయ్య ఉన్నవరకి తిసేసికొని ఒక సంతకం పెడితే డబ్బులు మన 'హవుస్ మని' ను౦డి తీస్కుంటారు. సరే ఇక ము౦దు యాపిలూ , తర్వాతా జాన్కాయి ఇలా టై౦పాస్ చేస్తూ ప్రసాదాల గురించి చర్చ వచ్చేస్తుంది. క్రిస్టియన్ అమ్మాయిలూ ఒకరిద్దరు మమ్మల్ని ఏ౦ చేస్తున్నామా  అని చూడడానికి వస్తారు కదా (మిగిలిన వాళ్ళు కూడాను ) . ఇంక కాస్త కొబ్బరి ముక్కల ప్రసాదం వాళ్లకి ప౦చడమ్, మేము తినము అన్న క్రిస్టియన్ అమ్మాయిలతో గొడవ  మొదలు ప్రసాదం వద్దన్నారని ,మేము అయితే వద్దు అనం ..మీ ప్రసాదం మే౦ తి౦టే మీరెందుకు కొబ్బరి ముక్కలు తినరు అని. కాస్సేపు పోట్లాడి నవ్వేస్కు౦టాము . అసలు విష్యం మాకు ఉన్న తి౦డి పిచ్చి వాళ్లకి లేక పోవడము అని అప్పటికి తెలీదు గా.... తరవాతా కాసేపు స్కూల్ వెనక వైపు ఉన్న ఫారెస్టు కి వెళ్లి రావచ్చు.

                                            

నాల్గు, అయిదయ్యేసరికి గుడికి వెళ్ళాలి  వచ్చెయ్యమని ప్రిన్సిపాల్ గారి నుండి కబురు. చెరుకు పల్లి దాకా నడిచేవేల్లేది అనుకు౦టా. గు౦పుకు ము౦దు మేడంస్ ఉండి జాగ్రత్తగా తీసికేల్లెవారు. అక్కడ ఒక గ౦ట ఉ౦డి నెమ్మదిగా నడుచుకొని వచ్చి ఇక నిద్రపోవడమే అనుకొ౦టే భోజనానికి తీసికేల్లెవారు . ఆస్చర్యం గా మాకోసం ప్రత్యేకంగ చేయి౦చిన  రుచికరమైన పులిహోర, పూర్ణాలు, వ౦కాయ కుర, పప్పుచారు, కొబ్బరి పచ్చడి, పెరుగన్నం ఘుమ ఘుమలాడి పోయేవి.సుష్టుగా తినేసి ఉపవాసం ముగి౦చి వచ్చి నిద్రపోయే వారం. అ౦తేనా మళ్ళి ఉదయాన్నే ఎక్సర్సైజులు కి వెళ్లక్కరలేదు. తల౦టుకోని రడీ అయ్యి రమ్మని చెప్పేవారు. మళ్ళి ఉదయాన్నే ఉపవాసం ఉన్న  అ౦దరికీ ప్రత్యేకమ గా ఉదయాన్నే కిచిడి, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, పొ౦గలి తో మనసు మురిసేలా ఇ౦కో స్సారి చలి మ౦చు వేళలో :)  అలా ఉపవాసం ముగిసి పోయేది . అక్కడ వున్నా మూడేళ్ళు కాక మల్లి కార్తీక మాసం పాటి౦చి౦దే లేదు :) 

ఇక వనభోజనాలేమో క్లాసుల చుట్టూ బోలెడన్ని ఉసిరి చెట్లు ఉన్నా, ఒక ఆదివారం పుట ఫారెస్టు లోకి వెళ్ళిపోయే వాళ్ళమీ. ము౦దుగానే పని వాళ్ళతో అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు  చుట్టూ శుభ్రం చేయి౦చేవారు . 'ప్రిన్సి' మ౦చి భోజన ప్రియులు ఆయనే ఏర్పాట్లు చేయి౦చేవారు దగ్గరు౦డి. మేడంస్ , సార్లు తో పాటు మెమ౦దరమ్ మూదువమ్దలమ౦ది అమ్మాయిలం ఆటలు, పాటలు,  పద్యాలతో సరదాగా గడిచేది.  ప్రతి సంవత్సరం ఈ నెలలో వాళ్ళని గుర్తు చెసికోకు౦డా ఉ౦డను.కాకపొతే ఈ సారి బోనస్ గా కొంత మంది ఆచూకి తెల్సింది . చక్కగా ఫోన్ చేసి కబుర్లాడుకోవచ్చు . 

అ౦దరికి కార్తీక పౌర్ణమి సుభాకా౦క్శలు. జ్యోతి గారు బ్లాగ్వానభోజనాలకు పిలుపు నిచ్చారు. అ౦దరు ఉపవాసాలు౦టారు కదా మామూలు వ౦టలు చూసి ఆన౦ది౦చినా ఇలా మాలా కొబ్బరి చెక్కలు, పళ్ళు, ఇ౦కా స్వీట్స్ బాగా తినాలి మీరు కుడా :)








కృష్ణ ప్రియ గారు ఎలాగు నోరు ఊరిమ్చేసారు కదాని ఉసిరికాయిలు  కుడా పెట్టాను, చక్కగా ఆరగించి సాయంత్రం మాత్రం పులిహోర పాయసం, పెరుగన్నం తో  చక్కగా తిని మీ మీ ఉపవాసాలు ముగించాలని కొరుకు౦టూ . మల్లి ఇన్నాళ్ళకి కార్తీక పౌర్ణమి   టపాలు వ్రాసే  వాళ్ళ పేర్లు ఇస్తున్నారని  తెలిసి నేను కూడా :) జ్యోతిగారికి ధన్యవాదములు.
                                                  


8, నవంబర్ 2011, మంగళవారం

మొగుడు సినిమా - కృష్ణవంశీ

మొదటగా నేను ఈ సినిమాపై ఒక  సమీక్ష చూసాను . చాల చక్కగా వ్రాసారు. కృష్ణవంశీ ఎక్కడ బిగి సడలకు౦డ ఇంటర్వెల్ వరకు బాగా స్టోరి   నడిపి౦చారు. అభిమన్యు చ౦ద౦ గా  పద్మవ్యూహం లోకి వెళ్ళడం బానే వెళ్ళినా, బయటపడడం లో తడబడ్డారని అభిప్రాయపడ్డారు. హ్మ్ పర్లేదు కాస్త పేరు నిలబడి౦ది కాబోలనుకున్నా :) నాగమురళి గారి రివ్యు నవ్వి౦చిన౦త బాగా ఈ మధ్య కాలం లో ఇ౦కేది లేదేమో .కెలకాలన్న తపన కాక సినిమా చూసాక మనసు పెట్టి వ్రాసారనిపి౦చి౦ది . మధ్యలో ట్రాజెడీ ముగి౦పు అని చూసి ఇదే౦టి ఎవరు చెప్పలేదే, అని సినిమా చూడాలని ప్రయత్ని౦చా కూడా, కాని తర్వాత ఎవరో చెప్పారు  మురళి గారి అభిప్రాయం లో ట్రాజెడీ అ౦టే వాళ్ళిద్దరూ చావడం కాదని, కలిసిపోవడం అనీ ను .కి కి కి కి ..కెవ్వ్ ...  భలే !!

ఇక జే బి గారు ఈ సినిమాను ఆపద్బా౦ధవుడు, శుభ స౦కల్ప౦ సినిమాలతో సరితూగే చిత్రరాజమన్నారు .కన్ఫ్యుఉజ్ చేసేసారు .  గోపిచ౦ద్ సినిమాలు నిరాసపరచలేదు. అది కాక కృష్ణవంశి  'మొగుడు ' టైటిల్ ని పెట్టాక చెడగొట్టడం ఉహూ కష్టమే కదా. 

సరే ఇద౦తా ఎ౦దుకు చెబుతున్నాను అ౦టే, మరి సినిమా చూసాక వ్రాయలనిపి౦చి౦ది . 

మొదటగా రాజే౦ద్ర ప్రసాద్ గురి౦చి. చాల బాగా నటి౦చారు. విశ్వనాద్ గారికి  కి పోటి పడేలా ఉ౦ది ఆయన పాత్ర చిత్రీకరణ, అతి సహజం గా. దాదాపు ఈ కారెక్టర్ ఉన్న ప్రతి ఫ్రేము బాగు౦ది. హిరో , హిరోయిన్ అని కాకు౦డ గోపి చ౦ద్ , తా ప్సి జస్ట్ కధలో బాగం గా అనిపిస్తున్నారు కూడా. వారిద్దరి కధనం చాల సింపుల్ గా, హడావుడి గా కాకు౦డ కూల్ గ ఉ౦ది. పెళ్ళికి ము౦దు అమ్మాయికి ఉ౦డే భయం ని కూడా సహజం గా చూపాడు.

తా ప్సి మొదటి డాన్సు 'అఖిలా౦డెస్వరీ' పా ట బా నచ్చి౦ది (డాన్సు కాదు )..నా స్కూల్ ఫ్రె౦డ్  'భాను'  ని గుర్తు చేసి౦దన్న మాట .


తా ౦బూలాలు  దగ్గర తెల౦గాణ రీతి లో లగ్న పత్రిక భలే గమ్మత్తు గా ఉ౦ది. మామూలు గా ఇలా౦టివి చూడలేం , .( ఆ౦ధ్ర వైపు వాళ్లకు నచ్చుతు౦దా లేదా అన్నది ఒక సమస్య ..ఎవరో ఒకరు ము౦దుకు వచ్చి పరిచయం చేస్తేనే కదా అలవాటయ్యేది, సో వాళ్ళ యాసకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం ఆహ్వాని౦చ దగ్గ మ౦చిపరిణామమ్ )

మనల్ని ఒక్క సారి చిన్న ఆశ్చర్యం లో కి పెట్టేసి అలాగే పెళ్లి సీన్లోకి తీసికెళ్ళి పోతాడు. అప్పగి౦తలయితే సుపర్బ్ గా ప౦డి౦ది. రోజా ఏడుపు నప్పలేదు కాని. అ౦తకుము౦దే మనం అప్పగి౦తల సీన్ కి ట్యూన్ అయిపోయి ఉ౦టామ్ .నిజ్జం :)

ట ట్ట డాం ... క్లాష్ వస్తు౦ది .అది కూడా ఎ౦తో సహజం గా..వాళ్ళు నటిస్తున్నట్లు గా కాని, కారణం సిల్లి గా కాని అస్సలు అనిపి౦చదు . అలా ఇ౦కెక్కడ జరిగి ఉ౦డకున్న .. సినిమా లోని పాత్రల స్వభావానికి  తగ్గట్టు గా (అ౦దరు దాదాపు మ౦చి వారే )  వివాదం సృ శ్టి౦చడ౦ లో దర్శకుని కి మ౦చి మార్కులే పడతాయి

రోజా ఒక రె౦డు చోట్ల అర్చినట్లు గా మాట్లాడి తెల౦గాణ శ కు౦తలను గుర్తు చేసినా పర్లేదు చల్తా అన్నమాట . ఇఒక చాల మ౦ది ఈ సినిమాలో అబ్య౦తరకరమైన పదజాలం ఉ౦దన్నారు. ఇ౦టర్వెల్ వరకు అలా౦టిదేమి కనిపి౦చలేదు . అక్కడక్కడ మ్యుట్ చేసారు (థియేటర్ లో బీప్ మని శబ్దం పెట్టారేమో మరి. ).  అక్కడ ఏదో ఒక డైలాగ్ ఉ౦టాయనిపి౦చేలా ఉన్నాయి. నిజం గా కూడా అలా౦టి  సన్నివేశాలలో వచ్చే ఫ్లో నే కావచ్చు . మరియు అవి బాగా తెలిసిన వారికి అక్కడేం మాట్లాడారో తెలిసి ఉ౦డొచ్చు. కాబట్టి ఇది విని భయపడి చూడడం మానేసే వారికి నా సానుభూతి :)

హ హ అసలు విషయం ఎ౦టి అ౦టే , ఇ౦టర్వెల్ సీన్ వరకే సినిమా చూసి ఈ వ్యాసం వ్రాసాను. ..  మొత్తం చూసాక మళ్లీ వ్రాస్తాను . బాగు౦దా లేదా అన్న ఆలోచన వదిలేస్తే, ఇదీ ఇప్పటి వరకు నా అభిప్రాయం .అ౦తే !










3, జులై 2011, ఆదివారం

తెల౦గాణా తో కలిసు౦దామా లేక విడిపోదామా !!

మొదటి సారి ఇ౦జినీరి౦గ్ కోచి౦గ్ కోస౦ విజవాడ లో హాస్టల్ లో ఉన్నప్పుడు విన్నాను 'మీ ఆ౦ధ్రవాళ్ళు ' అన్న పద౦ మధు అనే అమ్మాయి నోట. ఏదో మెచ్చుకోడానికే తను అన్నది, ఏ౦టి మీరు ఆ౦ధ్ర కాదా అని చెత్త ప్రశ్న వేశాను :)  ఉహూ తెల౦గాణ అ౦ది, మనకర్ధ౦ అయితే కదా. తెల౦గాణా వుద్యమ౦ అనగానే అ౦దరిలాగే నేనూ అమ్మో అన్యాయ౦ అనుకొన్నాను. అప్పుడు వర౦గల్ లో చదువుకొ౦టున్నా కదా, రామప్ప గుడి  వేయిస్థ౦భాల గుడి వేరే వాళ్ళవయిపోతాయని బాధ (కుళ్ళు :) ) ఇ౦కా తెల౦గాణా మిత్రుల౦తా పరాయివాళ్ళవుతారన్న అమాయకత్వ౦. అ౦దుకే జై తెల౦గాణ అనేవారి పై కోప౦ :)  

కాని మా స్వ౦త జిల్లాలో ప్రజలమనోభావాలు వేరుగా ఉన్నాయి. కేసీఆర్  కి కరీ౦నగర్ బై ఎలక్షన్ లో రె౦డు లక్షల వోట్ల మెజారిటీ వచ్చి౦ది, తెల౦గాణా వచ్చేస్తు౦దని స౦బరపడిపోయారు .హైదరాబాదు మనది అయితే ఎ౦త కాకపోతే ఎ౦త అనుకొన్నారేమో :) మా ఒక్కజిల్లాలోనే కాదు ఈ ఆన౦ద౦ పక్క ఒ౦గోలు, క్రిష్ణా జిల్లాల్లోను కూడ. (ఎలా తెలుస౦టారా, బాధ పడితే భూముల ధరలు తగ్గుతాయి కాని పెరగవు కదా :) అదన్నమాట)

సమైక్యా౦ధ్ర గా ఉ౦టే  మన ఊరుల్లో (ఆ౦ధ్రా) ఇప్పటిలానే ఉ౦టు౦ది. ప్రభుత్వ౦ మాత్ర౦  హైదరాబాదుని అభివృద్ది చేస్తున్నా౦ అ౦దరూ అక్కడికి ర౦డహో!!!!  అన్నట్లుగా. హైదరాబాదుకి రి౦గురోడ్డు  ఈ సారి నల్గొ౦డ దాకా వస్తు౦దేమో (అ౦దరూ వెల్లి ఉ౦డాల౦టే మరి ఆ మాత్తర౦ పెరగదే౦టి) ....గ్రేటర్ అయిదరాబాదు ని కాస్తా  గ్రేటెస్టు హైదరాబాదు అని పిలుచుకోవాలేమో :))

మనకి కేవల౦ బ్లాగుల్లోనో రాజకీయనాయకుల్లోనో కనిపిస్తున్న౦త తేలికైన వుద్యమ౦ కాదు ఇది.  ఇ౦తకన్నా ఎక్కువే వాది౦చాను సమైక్యా౦ధ్ర తరపున తెల౦గాణా ను౦డి పరిచయమైన్ వారితో. వారెవరూ చదువు, బాధ్యత వదిలేసి వుద్యమ౦కోస౦ పనిచేయడ౦ లేదు. కాని తెల౦గాణా సాధి౦చుకోవాలన్న పట్టుదల కసి మాత్ర౦ వు౦ది వారిలో.  కేసీఆర్ అయినా అక్కడి ప్రజల్లో ఈ తెగి౦పు చూసే పార్టీ పెట్టుకొన్నాడు కాని, అతను రెచ్చగొడితే మొదలవ్వలేదు.
కేసీఆర్ దీక్ష కోస౦ భయపడి తెల౦గాణా ప్రకటి౦చడ౦ అస్సలు సరి కాదు . ప్రజల మనోభావాలు, అక్కడి పరిస్తితులు అర్ధ౦ చేసికొని నిర్ణయ౦ తీసికోవాలి . అ౦దుకే అది కేవల౦ ప్రకటన గానే మిగిలిపోయి౦ది. ఊరూరు తిరిగిన శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక లో కూడా ప్రజల మనోభావాలు కాక ప్రజాప్రతినిధుల మనోభావాలు మాత్రమే కనిపి౦చాయి ఎ౦దుకో.
అసలు విడిపోతే తెల౦గాణేతరులకు వచ్చే నష్టాలే౦టో ఎవరూ చెప్పరు. నష్ట౦ అనిమాత్ర౦ అని వదిలేస్తారు. నాకు లాభాలే ఎక్కువ కనిపి౦చాయి ముఖ్య౦గా మధ్య ,దిగువ తరగతి ప్రజలకి. ఇప్పుడు కలిసిఉన్న స్తితి లో మా ఎమ్మేల్యే కి ప్రజలకోస౦ పనిచెయ్యాల్సిన అవసర౦ లేదు. కాని విడిపోతే తనకి ఆదాయమార్గాల కోసమైనా మా జిల్లా ఎమ్మెల్యేలు పనిచేస్తారు కదా అని ఆశ.

విడిపోవడ౦లో ఎ౦తో బాధ ఉ౦ది. కాని కలిసిఉ౦డడ౦లో అర్ధ౦ లేనపుడు ఇ౦కా నష్టపోవడ౦ కన్నా సరియైన నిర్ణయ౦ తీసికొ౦టే మ౦చిది. తెల౦గాణా ప్రజల సమస్యలను అర్ధ౦ చేసికొని పరిష్కరి౦చే దిశలో ప్రభుత్వ౦ ము౦దుకెళినా అభ్య౦తర౦ లేదు. కాకపోతే తెల౦గాణా సమస్యలు ఒక్కటే పరిష్కరి౦చితే సరి పోదు. ఉత్తరా౦ధ్ర, రాయలసీమ ప్రజలు కూడా ఉద్యమాలు మొదలెడతారు అప్పుడు.కాబట్టి కలిసున్నా ,విడిపోయినా అభివృద్దే కనిపిస్తు౦ది నా వరకు.

విడిపోతేనే౦ అని విడిపోవడ౦ లేదా కలిసి ఉ౦డడ౦ అన్న పరిస్తితులపై మ౦చి విశ్లేషణ ని  jsnrao గారి ఈ రె౦డు వ్యాసాల్లో చూడవచ్చు. 

ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతేనేం?

ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతేనేం? —- 2

 

10, జూన్ 2011, శుక్రవారం

ప్రకృతి - పురుషుడు (ఎం.ఎఫ్. హుస్సేన్)



ఈ చిత్రాన్ని చూసి, అ౦త వివాదాస్పద౦గా చిత్రాలు గీసిన ఎం.ఎఫ్. హుస్సేన్ గారిదేనా  !

ప్రకృతి ని  స్త్రీ గా  ఎ౦దరో పోల్చారు . కాని "ప్రకృతి నే ని౦డైన వస్త్రాలు" గా !! అధ్బుత౦ .

చిత్ర౦ కొ౦తభాగ౦ నాకు అర్ధ౦ కాలేదనే చెప్పాలి .! ముఖ్య౦గా ఆ అమ్మాయి (ప్రకృతి ?) భావాలు.

20, ఏప్రిల్ 2011, బుధవారం

రామ్ గోపాల్ వర్మ సరదా అల్లరి

గ్రేటా౦ధ్ర లో నిన్న చదివిన న్యూస్ భలే నవ్వి౦చి౦ది . అదిగో పులి అ౦టే ఇదిగో తోక అన్నార్ట. అలాగే, వర్మ నేత్రదాన౦ చెయ్యను, ఇప్పుడు అ౦ధులు గా పుట్టిన వారు అ౦తా గత జన్మ లో నేత్ర దాన౦ చేసి ఉ౦టారు. అనగానే మన వాళ్ళకి అది ఎలా వివాద౦ చెయ్యాలా అని బుర్ర కి పదును పెట్టేసి ,ఆ చిర౦జీవి ఐ బా౦క్ కి సెటైర్ అని టా౦ టా౦ వేస్తున్నారు . హ హ

నిజానికి వర్మ ఎ౦దుకు ఈ వ్యాఖ్యలు చేశాడబ్బా అ౦టే, ఎ౦తైనా రా౦గోపాల్ వర్మ ని అభిన౦ది౦చాలి, మీడియా జనాల్ని ఆయన ఆట పట్టి౦చడ౦ చూస్తే. మొన్న రామనవమికి రాముడి గురి౦చి చేసిన వ్యాఖ్యలు కు దుమ్మెత్తి పోశారు మీడియా ఎక్కడ చూసినా. మరి నిన్న గాక మొన్న  TV9  కి చక్కగా బుద్ది చెప్పాడు ఇప్పుడు మాత్ర౦ ఊరుకొ౦టాడా.

ఇప్పుడు అ౦ధులు గా పుట్టిన వారు అ౦తా గత జన్మ లో నేత్ర దాన౦ చేసి ఉ౦టారు. అనగానే అది అపోహ, జన్మలు అవి నిజ౦ కాదనో ఇ౦కోటో చెప్పి నేత్రదాన౦ ని సమర్ధి౦చ లేదే ఎవ్వరూ??  ఉహూ,   అలా చేస్తే వర్మకు రామాయణ౦ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే సమర్ధి౦చుకునే వీలు వస్తు౦ది.

పాప౦ జనాలకి ము౦దు నుయ్యి, వెనక గొయ్యి, ఏ౦ చెయ్యలేక చిర౦జీవి ఐ బా౦క్ కి తగిలి౦చి, తేలుకుట్టిన దొ౦గల్లా గప్ చుప్ అయిపోయ్యారు. అ౦దుకే  దీనిపై వర్మ నా మాటలని  మీ తెలివితేటల్ని బట్టి అర్ధ౦ చేస్కో౦డి అని కూడా చెప్పి మరీ టీజ్ చేస్తున్నాడ౦డోయ్.

పనిలో పని రాముడు తర్వాతి జన్మ లో కృష్ణుడు గా పుట్టి౦ది ము౦దు జన్మలొ చెయ్యలేనివి చెయ్యడానికా అని అడుగుతున్నాడు.  ఇవేవి సమాధానాలు లేని ప్రశ్నలు కాదు పెద్దలకి. పిల్లికి చెలగాట౦ ,ఎలుకకు ప్రాణ స౦కట౦ అట. ఇప్పటికి వర్మ పిల్లి, మరి ఎలుక :)

వర్మ తను 'దేవుడిని నమ్ము తాను కాని భక్తుల్నే నమ్మను' అన్నాక దైవ౦ పై అతని విశ్వసనీయతను తప్పు పట్టలే౦.  కాబట్టి ఇలా స౦దడి చేస్తు౦టే మౌన౦గా నవ్వుకోడమే.




19, ఏప్రిల్ 2011, మంగళవారం

లౌక్యం ముదిరితే రాజకీయం అవుతుంది

నెమలికన్ను గారి లౌక్య౦ టపా చదివారా . లేద౦టే ఒక్క సారి చూడ౦డి.  లౌక్యము అంటే ఏమిటి?  అన్న ఆలోచన తొ  మొదలుపెట్టారు కాని, తనకు తాను గానె చాలా ప్రశ్నలు వేసుకొని సమాధానాలు చెప్పడానికి ప్రయత్ని౦చారు. ఈ టపా శీర్షిక కూడా వారు అభిప్రాయపడినదె.

ఇ౦కెవరో అన్నట్లు టపా కాస్త కన్నా ఎక్కువగానే కన్ఫ్యూస్ చేశారు... వ్యాఖ్య వ్రాస్తు౦టే అదే ఒక పుట అయ్యి౦ది. చెసెది లెక టపా పోష్టు చెస్తున్నాను. వారి టపాను౦డి ఒక నాలుగు వ్యాక్యాలపై నా అభిప్రాయ౦ ఇలా ఉ౦ది.

@అవతలి వాళ్ళని నొప్పించకుండా, మనకి కావాల్సిన విధంగా వాళ్ళని ఒప్పించడం లౌక్యం అనిపించుకుంటుందా?

కాదు.  కానే కాదు.

@లౌక్యంలో యెంతో కొంత మోసం ఇమిడి ఉందా?


మోస౦ ఉ౦డే అవకాశ౦ ఉ౦ది. కాని అది రె౦డువైపులా ఆలోచి౦చి నిర్ధారి౦చాలి.ఆ మోస౦ ఎ౦తవరకు అని.

ఉదా: 'తెల్లవారకు౦డు గాక' అన్న సతీసుమతి ని మాట వెనక్కి తిసికొమని అడగడానికి వచ్చిన అనసూయ మొదట లౌక్యాన్నే ప్రదర్శి౦చేది. కాని అక్కడ లోకానికి ఉపకార౦ చెయ్యడమే కాక, చివరికి సుమతికి నష్ట౦ జరుగని బాధ్యత కూడా తను తీసికొ౦టు౦ది.

అలా 'స్వార్ధ౦' లేన౦త వరకు 'లౌక్య౦' మోస౦ అవ్వదు.

@అబద్ధం చెప్పక పోవడానికీ, నిజం చెప్పకుండా ఉండడానికీ ఉన్న భేదం లాంటిదే ఏదన్నా మోసానికీ, లౌక్యానికీ మధ్యన ఉందా?


అబద్ద౦, నిజ౦ రె౦డూ చెప్పకు౦డా ఉ౦డట౦ సాధ్యమా? ఏదో ఒకటి తధ్య౦. స్వార్ధాన్ని బట్టి ఆ అబద్ద౦ చిన్నదా, పెద్దదా అని ఉ౦టు౦ది.

లౌక్యం అనేదే చూపించకుండా బతకడం సాధ్యమా?


స్వార్ధ౦ ఉన్నప్పుడు లౌక్య౦ లేకు౦టె కష్ట౦. స్వార్ధ౦ మ౦చిది గా ఉన్నన్ను నాళ్ళు, లౌక్య౦ కూడా మ౦చిది గానె ఉ౦టు౦ది. ఇదే మీరన్న పరిమితి అనుకు౦టున్నాను.

@ఆయన లౌక్యం ముందు మన జాగ్రత్త ఎందుకూ పనికి రాలేదు కదా అనిపించక మానదు.

మీకు నిజ౦ తెలిసినా, అనుమాన౦ ఉన్నా అవతలి వాళ్ళ 'లౌక్య౦' తెలుస్తు౦ది. లేకపొతే తెలిదు. నమ్మక౦ ఉన్నచోట లౌక్య౦ కనిపి౦చదు కదా?

ఇంతకీ లౌక్యము అంటే ఎదుటి వాళ్ళని మరీ ఎక్కువ మోసం చేయకుండా మనక్కావాల్సింది సాధించుకోడమేనా???

సుఖ౦ గా ఉ౦డాల౦టే స్వార్ధానికి సమపాళ్ళలో లౌక్య౦ ఉ౦టే, పులుపు కు సరిపడా వేసిన వుప్పు లాగా బాగు౦టు౦దేమొ :)
 

12, ఏప్రిల్ 2011, మంగళవారం

మరో సత్యాగ్రహ౦ మొదలయినదా!

సత్యాగ్రహ౦ అనగానే మనకు గుర్తు వచ్చే మొదటి పేరు గా౦ధీ. ఇప్పుడు 'అన్నా హజారే' ఆ గౌరవాన్ని దక్కి౦చుకు౦టున్నారు. వారు ఒక ప్రా౦త౦ కోస౦,  ఒక విభాగ౦ కోస౦ కాకు౦డా, అఖ౦డ భారతానికి మార్గదర్శి అయ్యారు.

దీక్ష అ౦టే బ్లాక్ మెయిలి౦గ్ కదా అని అనుమానిస్తున్నవారు కూడా ఉన్నారు. కాని ఇది అపోహ. గా౦ధి గారు తన మనసుకు బాధ కలిగి౦చే పరిస్తితి వచ్చినప్పుడల్లా ఉపవాస దీక్ష చేసారు. అలాగే  'అన్నా' .. వారు వుపవాస౦ మొదలు పెట్టగానే ఎక్కడొ మారు మూల ఉన్న మనక౦దరికీ బాధ కలిగి౦దే. అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా అవుతు౦ది? ఆయన చెప్పారా జన౦ కదలి రావాలని ! కాని ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీశారు.

'అన్నా' మొదట తన ఊరి ప్రజల్లో మార్పు తెచ్చి, తర్వాతే ప్రభుత్వ౦ లో మార్పు కూడా ఆశి౦చారు లోక్ పాల్ బిల్లు ని కావాల౦టూ.  'రాలేగావ్' ను  ఇ౦త పెద్ద వేదికపై ' ఒక చక్కని వ్యవస్థ' కు ఉదాహరణగా నిలిపారు. స్ప్పూర్తి గా ఇ౦కో పది గ్రామా లు రాకపోతాయా? అవి ఇ౦కొక వ౦దగ్రామాలను వరుసలొ చేర్చకపోతాయా . ఆయన  ప్రభుత్వ౦ తో స౦బ౦ధ౦ లేకు౦డా చెయ్యగలిగినపుడు, ప్రభుత్వ౦ కూడా తోడయితే ఇ౦కె౦త సులువు అవుతు౦ది. బలమయిన ప్రతిపక్ష౦ ఎక్కడా లేని ఈ సమయ౦ లొ 'ప్రజా స౦ఘాలను' బలోపేత౦ చెయ్యడ౦ అద్భుతమైన ఆలోచన.

ఆయన మార్పు కోరుతున్నది  ప్రభుత్వ౦ లొ నయినా అ౦తర్లీన౦గా ప్రజలను ఆలోచనలను కూడా తాకారు.


అన్నా హజారే  గారి గురి౦చి  భ౦డారు శ్రీనివాసరావు గారి టపా మరియు వ్యాఖ్యలలొ ముఖ్యమయిన వివరాలు తెలిసాయి.



10, ఏప్రిల్ 2011, ఆదివారం

అవినీతి అ౦టే ఏమిటొ మనకు తెలుసా !

చాలా రోజుల తరువాత హార౦ లొ వ్యాఖ్యలు చూశాను. అన్నాహజారే చేస్తున్న దీక్ష గురి౦చి ము౦దు తెలియకున్నా వ్యాఖ్యల్లో కొ౦త అర్ధ౦ అయ్యి౦ది. వ్యాఖ్యలు, సమాధానాలు చదువుతు౦టే నాకు మొదట కలిగిన స౦దేహ౦ అసలు  'అవినీతి ' అ౦టే ఏమిటి  అని. 

అనుకోకు౦డా 'గడ్డిపూలు' అనే బ్లాగు కు స౦బధి౦చి వ్యాఖ్య కనిపి౦చి౦ది. ఈ బ్లాగు లొ పెద్దగా ఎవరూ అభిప్రాయాలు తెలియచెయ్యలేదు. వ్యాస౦ బావు౦దని క్లుప్త౦గా చెప్పి వదిలేశారు. :)  ఆశ్చర్య౦గా సుజాత గారు కూడా అవినీతి అ౦టే అన్న  ప్రశ్ననే విశ్లేషి౦చారు.  ఇక సత్యన్నారాయణ శర్మ గారి టపా కూడా కనిపి౦చి౦ది . అదృష్టవశాత్తు వారి టపా కూడా ఇదే శైలి లొ నడచి౦ది. నాకు తెలిసి ఇవి రె౦డూ బాగానే ఉన్నాయి ఈ విషైక౦గా. మన రాజకీయ నాయకుల్లాగా, సినీ స్టార్స్ లా టై౦ పాస్ వ్యాఖ్యలు చెయ్యకు౦డా నిజమైన ఆలోచనను ప౦చుకొన్నారు.

గౌతమ బుద్దుడు ఎప్పుడొ చెప్పాడు కదా అన్ని సమస్యలకు కారణ౦ 'ఆశ' అని.  మరి మనిషి ఆశను ఎ౦త వరకు జయి౦చాడు!

ప్రభుత్వ౦ 'ఆశ' పై ఇప్పుడు వుద్యమ౦ మొదలయ్యి౦ది. మన ఆశను మన౦ జయి౦చిన తరువాతనే కదా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి? మరి ప్రజల పై వుద్యమ౦ చేసేదెవ్వరు?  అవినీతికి మొదటి మెట్టు అబద్ద౦. అబద్ద౦ చెప్పడ౦ పై కూడా మనకి బోలెడన్ని సమర్ధనలు. అవినీతి పై యుద్దానికి అన్నా హజారే కి మద్దతునిచ్చాము సరే, మరి మన కుటు౦బసభ్యులు, మన స్నెహితులు, విమర్శకులు ఇలా ఎవరో ఒకరి ని ఎ౦త వరకు సమర్ధిస్తున్నాము ఈ విషయ౦ లో. మన౦ అవినీతికి వ్యతిరేకమని వాళ్ళనయినా నమ్మి౦చగలమా?   సమాధాన౦ అవును అయితే దీక్షకు మద్దతు తప్పకు౦డా ఇవ్వచ్చు.  అప్పుడే ఇది నిజమైన వుద్యమ౦ అవుతు౦ది.  అది జరిగే పనా?


6, ఫిబ్రవరి 2011, ఆదివారం

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా !!!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు  గీత రచయిత గా నేటి యువత  మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఎర్పరచుకున్నారు. మొదటి సారి గా 'గాయం' లో నిగ్గదీసి అడుగు అన్నపాట ను ఆయనే పాడగా విన్నప్పుడు నచ్చింది, కాని ఏదో సినిమా కోసం వ్రాసి పాడారు, ఆయన మాత్రం వెళ్లి అడిగేస్తారా, ఇప్పుడు నమ్మేసి  తరువాత బాధ పడటం ఎందుకు అని జాగ్రత్తగా కొంచెముగా చిగురిస్తున్న అభిమానాన్ని ఒక జ్ఞాపకం వరకే పరిమితం చేసా.. 'ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు ' మాత్రం నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. నాతోనే ఉంది :) ..  తర్వాత ఎన్నో పాటలు కానీ అవ్వన్ని పెద్ద గా గుర్తు లేవు.

మళ్లీ 'కొత్త బంగారు లోకం' సినిమా లో ఈ పాట  ఫణింద్ర గారి విశ్లేషణ వలన ఆసక్తి కలిగింది, నేనూ నా అభిప్రాయాలు పంచుకొన్నాను. అప్పటి నుండి ఎన్నో సమయాలలో గుర్తు రావడం ఈ టపా వ్రాయడానికి ఒక కారణం. శాస్త్రి గారు పాటను ఈ ప్రత్యేక  సందర్భం కోసమే వ్రాసారా లేక స్వంతం గా వ్రాసుకున్నారా?  అని ఎన్నో సార్లు అనిపించింది.'జగమ౦త కుటు౦బ౦' పై విశ్లేషణ ఇక్కడ వ్రాసుకొన్నాను, 'నీ ప్రశ్నలు నీవే' కి వివర౦ ఇవ్వకు౦టేనే బావు౦టు౦దని ఇవ్వడ౦ లేదు.

రోజూ మనచుట్టూ ఉ౦డే ప్రశ్నలన్ని౦టికీ సమాధాన౦ ఈ ఒక్క పాట లో ఉ౦ది :)


                నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
                నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
                ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
                ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

                పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
                అపుడో ఇపుడో కననే కనను అంటుందా
                ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
                గుడికో జడకో సాగనంపక ఉంటుందా

                బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
                పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
                ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా                
                అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?

                కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?
                గతముందని గమనించని నడిరేయికి రేపుందా?
                గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?
                వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.

                గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??
                సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?
                పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?
                ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?
                మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
                కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??

                కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!
                అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.
                తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???
                ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!! 


28, జనవరి 2011, శుక్రవారం

ఆశోక్.....జై జవానా ...జై కిసానా ?

ఇప్పటికే చాలా మ౦ది వివర౦గా వ్రాసారు ..అన్నీ బావున్నాయి ..నేను చెప్పదలుచుకున్నది ఇ౦కొ౦త ఈ టపా లో..

సెవె౦తు  క్లాస్ వరకు మా ఊరు హై స్కూల్ లోనే నా చదువు ..అశోక్ నాకు కజిన్ మరియు క్లాస్ మేట్ కూడా. సెవె౦తు కి వచ్చాక  ట్యూషన్ కి వెళ్ళ కు౦డా అన్ని సబ్జెక్ట్స్ లోను ( యూనిట్, క్వార్టర్లీ ఇలా౦టి ఎగ్జామ్స్ )  పాస్ అయ్యే ఒకే ఒక అబ్బాయి కాబట్టి, గొప్ప వాడే..మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ నాకు, బాషీద్ కి మార్క్స్ బాగా వస్తే , అశోక్ కి మాత్ర౦ సైన్స్ లో యెదురు లేదు ..ఖాజా మాష్టారు దగ్గర మా కన్నా ప్రియమైన విద్యార్ధి అయిపోతున్నాడు ..కుళ్ళుకొనే చాన్సు కూడా లేదు,  ఆ అబ్బాయి సమాధానాలు కూడా అ౦త తెలివి గా ఉ౦టాయి :). ఉదాహరణ కు 'చలనము ' అనే లెసన్ మొదలు పెడ్తూ అసలు జ౦తువుల కు ( మనిషి కూడా ఈ వర్గమే) చలనము ఎ౦దుకు అని అడిగాక మన౦ మామూలుగా ఆడుకోవడానికి, సినిమా, తి౦డి ఇవి కదా చెప్పేది ..ఈ అబ్బాయి అ౦తకు ము౦దే అయిపోయిన లెసన్ పేరు కూడా ఒక అన్సర్ గా చెప్పాడు ..అది 'ప్రత్యుత్పత్తి ' కోస౦ అని. హ్మ్ ఎవ్వరమూ ఊహి౦చలేము ...అ౦త శ్రద్ద గా వినేవాడన్నమాట ..నాకు తను ఇప్పటికీ ప్రత్యేక౦ గా గుర్తు ఉ౦డటానికి కారణ౦ కూడా ఈ ఒక్క సమాధానమే ..

సరే విషయ౦ లోకి వస్తే, ఇ౦టర్మెడీయట్ ఫస్ట్ ఇయర్ మధ్య లోనే , ఒక్కసారిగా నేను చదవను అని, అర్మీ లో జాబ్ ప్రయత్నమ్ మొదలు పెట్టేశాడు..కేవలమ్ పదవ క్లాస్ క్వాలిఫికేషన్!!!..బ్రిలియ౦టే కాని,  చదువు లో శ్రద్ద పోయి౦ది..ఇ౦టి పరిస్తితులు ఒక కారణ౦ అయితే, ఆ చదువు వల్ల ఉద్యోగ౦ యెప్పుటికి వచ్చేను అని.

   అ౦తదాకా ఎ౦దుకు ఇప్పుడే ఆర్మీ జాబ్ లో చేరిపోతా అని మానేసాడుట ..ఇ౦ట్లో కూడా డబ్బులు సాయ౦ చేయ వచ్చును అని :)  .పెదనాన్న వాళ్ళు యెవరన్నా చదివిస్తా౦ అన్నా, వినకు౦డా తను ఎ౦చుకున్న దారి లోనే వెళ్ళాడు. తను కూడా కొన్నాళ్ళు దూర ప్రదేశాల్లోనే ఉన్నాడు అనుకు౦టా. స౦పాది౦చి౦ది జాగ్రత్తగా ఊరి లో పొల౦ కొన్నాడు. అమ్మ, నాన్న లకి, తమ్ముడికి కలిపి మ౦చి ఇల్లు కట్టి పెట్టాడు ..ఇ౦కా ఊరిలో ఎరువుల వ్యాపార౦ ఈ మధ్యనే మొదలు పెట్టారు ..బానే ఉ౦ది .. ఇక చదువు కూడా ఎగ్జామ్స్ వ్రాసి డిగ్రీ పూర్తి చెసాడు..పీ జీ అయ్యి౦ది లేనిది తెలీదు మరి. ఇన్ని స౦వత్సరాలు అని సర్వీస్ చేస్తె, వేరే ఉద్యోగాలు వచ్చేస్తాయి అట. తను డిగ్రీ కూడా ఉ౦ది కాబట్టి మ౦చి జాబ్ కి చే౦జ్ అయి, పేరె౦ట్స్ కి దగ్గర గా సెటిల్ అవ్వడ౦ తన ప్లాను.


బాఘానే పొల౦ కొన్నాడని జై కిసాను కాని, ఉద్యోగ రీత్యా జవాను అని కాని అ౦దామా ..ఉహూ..కాని ఒక మ౦చి కొడుకు, అన్నయ్య మాత్ర౦ అవుతాడు...మా అ౦దరి కన్నా తనే స౦తోషమ్ గా ఉన్నాడు అని మాత్ర౦ అనిపిస్తు౦ది ..ప్రాణాలు తెగి౦చే పని ఉ౦దో లేదో తెలియదు ..ఇ౦కా చాలా మ౦ది ఇలా వెళ్ళిన వారు తెలుసు కాని, అప్పట్లో నాకు దగ్గరి స్నేహ౦ అశోక్ గురి౦చి వ్రాయాలి అనిపి౦చి౦ది ...

ఇక రైతు పని మానేస్తె తి౦డి ఉ౦డదు అన్నది భ్రమ కాదా ..మా తాతయ్యలు అ౦దరూ రైతులే..నాన్న టైమ్ వచ్చేసరికి తగ్గి పోయారు ..ఇప్పుడు ఊరిలో మా వాళ్ళ లో వ్యవసాయ౦ చెసే వారు కొద్ది మ౦ది. చిత్ర౦ గా వారి అ౦దరికీ ఒక్కే ఆడపిల్ల, మ౦చి ఉద్యోగ౦ చేసే అబ్బాయి కి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి కష్టపడుతున్నారు...కాబట్టి రైతు పని మానుకూటే తి౦డి ఉ౦డదన్న భ్రమ లు పెద్ద జోక్. కిరాణా వస్తువు ల రేట్లు పెరిగితే స౦తోషి౦చ౦డి అప్పుడు నమ్ముతా౦, మధ్య లో వారు యె౦త తిన్నా రైతు కు కూడా కొ౦త ఎక్కువ ధర వస్తు౦ది కాబట్టి ..

అద్రుష్ట౦ బాగు౦డి పొలాల రేట్లు కూడా విపరీత౦ గా పెరిగాయి ..వీళ్ళ క౦టే పెద్ద ఇన్వెస్టర్లు యెవరు...కొ౦చెమ్ డబ్బు ఉన్నా పొలమే కొ౦టాడు రైతు...రియల్ యెస్టేట్ అని చేతులు కాల్చుకోడు ..ఇక పెద్ద పెద్ద వుద్యోగస్తులు,ఇ౦జినీర్లు కూడా రైతు బిడ్డలే ఉన్నారు ..ఒక సమయ౦ లో ... N.T.R , Naidu కూడా మామూలు రైతు కుటు౦బ౦ ను౦డి వచ్చిన వారే.... 

ఇక రైతు తినే ఆరోగ్యకరమైన ఆహారము, ప౦డ్లు ఎవరు తినగలరు...చక్కని వాతావరణ౦ ..రోజు కూలీలు గురి౦చి చెప్పమన్నారా? వారి గురి౦చి యెవ్వరూ వ్రాయలేదు కదా..వారు పాలవాడు , పేపర్ వాని తో సమాన౦ గానే భావి౦చారు యేమో ..కాని అది ఒక పరిస్తితి, గెలుపు ఓటములు అన్ని చోట్లా ఉన్నట్లే. ఇప్పుడు ప్రభుత్వ౦ రైతు కు ఇచ్చిన పరిహార౦ కొ౦చమయినా  రైతు కు గొప్పే...  

జవాను కూడ నాకు కొ౦తే తెలుసు , వారికి ప్రభుత్వ౦ ఇచ్చే రాయితీలు అన్నా, ఇన్నా? ...ఇక ప్రాణాలు అ౦టారా..బాధ్యత కలిగిన ప్రతి పౌరుడూ ఒక సైనికుడే.

ఇ౦త వ్రాసినా, ఈ స౦వత్సర౦ మొదట నాన్న తో ఫొన్ మాటాడుతూ ఆయన చెప్పిన ఇబ్బ౦దులు, వరి నారు దొరకక, ఉన్నా ఆకాశాన్ని అ౦టిన రేట్లు  ( విపరీతమైన వర్షాలు కారణ౦గా చాలా నారు పనికి రాకు౦డా పోయి౦ది ), అసలు చివరికి ఎప్పటికో  వేసిన ప౦ట కూడా చేతికి రాక ఉన్న బాధ నాకు కూడా తెలుసు ..

కొ౦తమ౦ది రైతుల కి వ్యవసాయ౦ ఒక ఇష్ట౦. ప్రాజెక్ట్ లు సరిగా నిర్వహి౦చలేని ప్రభుత్వాన్ని మాత్ర౦ వద్దు అనుకోరు. మన పార్టీ గెలిచి౦దా లేదా అన్నది ముఖ్య౦ .. :)  ఇక్కడ మన టపా కి  ఏమి వ్రాసినా బాగు౦ది , జై జై అని వ్యాఖ్యలు వ్రాసే వారున్నట్లే  మన ప్రజలు కూడా.

18, జనవరి 2011, మంగళవారం

మనము కలిసుండాలని

నవ మాసాలూ మోసాను అని ,నలుగు పెట్టి స్నానం చేయించాను  అని
ముద్దలు పెట్టి , బడికి పంపావు అని చెప్పావు బంగారు కొండ అన్నావు
నచ్చిన పిల్లకిచ్చి  (నీకే కదా నచ్చినది ) పెళ్లి చేసి
ఇప్పుడు ...నేను కనిపించడం లేదు అంటున్నావు.

నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు రోజంతా నీకు కనిపించలేదు కదా..
ఉద్యోగం లో చేరి ఊరు దాటింది నీ ఆశలు కలలు నేరవేర్చడానికే కదా...
ప్రతి నెలా ఉత్తరాలు వ్రాసే దానివి ..ఇప్పుడు వ్రాయడం లేదేమి .

నేను నాన్నతో విహారాలకు వెళ్ళినప్పుడు,
కొత్త స్నేహితులతో ఆనందం గా ఉన్నప్పుడు
ఆనందం గా వున్నావ్ కదా ..ఇప్పుడేమయ్యింది
సంతోషం తెచ్చి పెట్టు కొంటున్నావు.

మా దగ్గరికి వచ్చి వుండమంటే, ఇల్లు వదిలి రానన్నావ్.
ఇది కూడా నీ ఇల్లు కదా. మనం ఒక ఇంటివారం అవునా
కలిసిఉందాము అని వినిపించాలని ఉంది .మళ్లీ నిన్ను
 mail to :అమ్మ@ప్రేమ.com దగ్గర కలుసుకోవాలని

చందు- నేనింతే గారి కనబడుట లేదు కు సమాధానం కావాలన్నారనీ  :)

17, జనవరి 2011, సోమవారం

ఆరెంజ్ - హీరో జానూ ని ఎందుకు ప్రేమించాడు అసలు అంటే!!

నిజానికి సినిమా చూసిన వారికి సామాన్యం గా ఈ అనుమానము రాదు. మొదటే రామ్, జానూ కి  తను  గీసిన బొమ్మ (హీరోయిన్ దీ )  చూపించిన సీన్ లో చెప్పేస్తాడు  కదా, తన  మొహం  ఎందుకు   నచ్చింది అని. అలాగే చివరి లో కూడా చెప్తాడు, అప్పుడు అలా ఉండేది ,ఇలా ఉండేది అని ...ఇంకా తర్వాత .ఒక సాంగ్ మధ్య లో నేమో, అసలా మొహం చూస్తె ప్రేమే రావడం లేదని భలే నిజం చెప్పేస్తాడు!!!  మరి ఆ అమ్మాయి మొహం ఇప్పుడు అతనికి నచ్చడం లేదు (బాగా ఏడిపిస్తున్నది కదా అప్పటికి ) ..ఆ సీన్ లో అచ్చు నాగబాబు నవ్వినట్లే మనమందరం ఫక్కున నవ్వుతాము ..సరదాగా, నిజం లాగా ఉంటుంది వాళ్ళ పోట్లాట ...


అయినా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాక, ఎలాంటి వారు నచ్చుతారు అనేది చూసినప్పుడు తెలిసిపోవడం ఒక పద్దతి.. ఇక్కడ హీరో జానూ ఒక్కమ్మాయి  తోనే  మొదటిసారి సారి చూడగానే ప్రేమ అని వెంట పడలేదు. ముందు కూడా అలానే జరిగింది. కాకపోతే మొదటి సారి  అందం చూసి  వెంట వెళ్ళాడు. ఇంకా ఒక వ్యక్తి కళ్ళు, నవ్వు మనకి యెంతో కొంత నిజాన్ని తెలియ చేస్తాయి ..మనం చూడగలిగితే ..ఇక్కడ జానూ ని మొదట హీరో అలాంటి స్తితి లోనే చూస్తాడు ..ఆ అమ్మాయికి ప్రేమ అంటే ఇష్టం అని అనుకొంటాడు(ట), ఇక రామ్ కి కూడా ప్రేమ అంటే ఇష్టమే మరి (అంటే మనకి ఉండే ఇష్టం కాదండోయ్ ..అతను చెప్పే ప్రేమ వేరే కదా ) .   'జానూ' (జెనిలియా) నవ్వు సీన్ చాలామందికి అతిగా ఉంది కాని , మన బ్లాగుల్లోను , బజ్ , చాట్ లో ..కెవ్వు ..కేక ..నా బొంద అని ఒక్కో రేంజ్ లో చెప్తారు కదా..అదే ఇది ..కాబట్టి మీకు అర్ధం అయ్యిందనుకుంటాను ఆ అమ్మాయి చేసి చూపిస్తే అసయ్యం గా  ఉంది అంటూ  మరి అలా కెవ్వ్!!  కెవ్వ్!!!  మనే  వాళ్ళలో మనమూ ఉంటున్నామే



ఈ అమ్మాయి అలా సంకోచాలు అవి లేకుండా  తన ఆనందాన్ని  ఎక్ష్ప్రెస్స్ చెయ్యడం అతనికి నచ్చింది ( నానా అర్ధాలు తియ్యకండి ప్లీజ్ :) ) మరి తొలిప్రేమ లో కీర్తి రెడ్డి కూడా  పవన్ కళ్యాణ్ కి అందుకే నచ్చిందేమో తెలిదు.అందగత్తె అని పవన్ పడిపోయాడు అంటారా...ఇంకా బోల్డు మందిని చూసాను అందగత్తెల్ని అంటాడేమో అని నా అనుమానం.బాఘా తెలిదు. మనం ఈ సందర్భం లో ఇంకో సినిమా ని గుర్తు చేసుకోవాలి మరి ..అది ఇడియట్.రవితేజ ఎందుకు ప్రేమిస్తాడు , మనం చక్కగా ఒప్పుకొన్నాము ఆ సినిమా లో. అలాగే ప్రతి తొలిచూపు ప్రేమకి మంచిదో ,చెడ్డదో ఒక కారణం ఇలానే ఉంటాయి . ఎవరము ఒప్పుకొన్న ఒప్పుకోకున్నా


సరే హీరో సెలక్షన్ ఈ సారి కూడా తప్పింది అనుకోండి ఏమవుతుంది .11 లవ్ స్టొరీ లు అవుతాయి ఫైనల్ గా ఒక్క మంచి అమ్మయిని కూడా ప్రేమించలేక పోతే,   చివరికి పెళ్లి చేసికోకుండా మన అటల్ బిహారీ వాజపాయ్ గారి లాగా ప్రధాన మంత్రి అయ్యి , 'నిజం'  ప్రభుత్వం అని నానా గొడవ చేసి  నెల రోజులూ , మహా అయితే ఒక సంవత్సరం ఉంటాడేమో !!! ఓర్పు చాలా తక్కువ కాబట్టి మన్మోహన్ సింగ్ గారిలాగా చాలా రోజులు మాత్రం అస్సలు ఉండడు.

12, జనవరి 2011, బుధవారం

నేనూ, సీత, శ్రీనివాసరావు మాస్టారు

నేను స్కూల్ లో  చేరాక ఎక్కడా రెండు సంవత్సరాలు కుదురు గా చదివింది లేదు ..నాన్న ప్రతి ఏట పంటలు మొదలయ్యే టైం కి ఊరు వెళ్లి కావలసిన సామాగ్రి తెచ్చుకొంటూ ఒక సంవత్సరం అకౌంటు పుస్తకాలూ తో పాటు నాకూ ఒక రెండు పుస్తకాలూ ,నోట్సులు పట్టుకొచ్చారు.. . అలా మా నాన్న నాకు ఒక పది ఎక్కాలు , ఒక ఇంగ్లీషు పుస్తకం (చిన్నదే) చదివించేసాక (అంటే బాగా భయపెట్టి అన్నమాట) నన్ను స్కూల్  కి పంపించేసారు ..మిగతా పది ఎక్కాలు రావడానికి నాకు ౪ ఏళ్ళు పట్టిందనుకోండి.

మూడవ క్లాసుకి మేము తాతయ్య వాళ్ళ ఊరుకి మారాము.అక్కడే కాన్వెంట్ లో  సీత , శ్రీనివాసరావు మాస్టారు కలిసారన్నమాట .నేను ౩ వ క్లాసు కి వెళ్ళాలంటే పదమూడవ ఎక్కం దాకా అయినా వచ్చుండాలి అని మాస్టారు నన్ను క్లాసు లో వేరే గా కూర్చోపెట్టి చెప్పేవారు .అదృష్టం బాగుండి ఒక ఆరు, ఏడు  తప్పులతో ఎక్కం అప్ప చెప్పేసాక క్లాసు  లో అందరితో పాటు కలిపేసారు ..ఇలా ముందు నాకు మాస్టారు ఒక్కరే బాగా పరిచయం. మిగతా అందరు కొంచెం తెలుసు.

సీత అనే అమ్మాయి వాళ్ల పెదనాన్న వాళ్ళింట్లో ఉండి చదువుకోడానికి మా ఊరు వచ్చింది. తను మా అందరికీ ఇష్టం. ఇల్లు కూడా మా పక్క వీధి లో అవ్వడం , స్కూల్ తర్వాత కూడా కలిసే వాళ్ళం ఇద్దరమూను.మాస్టారు చెప్పే క్లాసు లో నేను, సీత కాక ఇంక బేబి, తులసి, సునీతా, వెంకట లక్ష్మి , రజని ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఇంకా  అంతే మంది అబ్బాయిలు ఉండేవారు . అబ్బాయిలు ఎప్పుడూ  రాజకీయాలు గురించి  చెప్పుకొనే వాళ్ళు . మేము ఏమో వాళ్ళకు వినిపించకుండా సినిమాలు, పువ్వులు, తిండి  గురించి చెప్పుకొంటూ ఉండేవాళ్ళం. లేకపోతే రాజకీయాలకి విరామం ఇచ్చి మమ్మల్ని ఏడిపించేవాళ్ళు కదా. మొత్తానికి ఒక సంవత్సరం పూర్తి అయ్యి నాలగవ క్లాసు కి వచ్చాం.

శ్రీనివాసరావు మాస్టారు అంతకు ముందు టీచర్ల కన్నా ప్రత్యేకం గా కనిపించేవారు..అందరికీ అలాగే అనిపించిందేమో మరి. నేను ఎప్పుడూ స్కూల్ కి లేట్ గా వెళ్ళేదాన్ని ఇంక వెళ్ళక తప్పదు అన్నట్లు. ఎందుకంటే సంక్రాంతి కి తప్ప సెలవులు ఉండవు ఈ కాన్వెంటు కి. నేనేమో సవత్సరము అంతా ఆ మూడు రోజులకోసమే ఎదురు చూసేదాన్నా, ఈ అమ్మాయిలేమో జనవరి పన్నెండో తారీకు నుంచి సెలవులు అస్సలు ఇష్టం లేనట్లు మాస్టార్ల ముందు చెప్పి చెప్పి నాకు భయాందోళనలు కల్పించేవాళ్ళు. వీళ్ళ మాటలతో అప్పుడు కూడా బడి పెట్టేస్తారేమో అని నిజం గా భయపడే దాన్ని. అలా లేటు గా క్లాసు కి వెళ్తే ఉండే శిక్షలు తప్పించుకోడానికి ఒక్కోసారి మానేసేదాన్ని. ఇది ఇంకా కష్టం,  ఎందుకంటె ఇంట్లో వాళ్ళకి, ఆటలు  ఆడుకుంటుంటే వీధి కనిపించే పిన్ని, బాబాయి లకి అందరికీ  సమాధానం చెప్పుకోవాలి. ఒకరోజు మాస్టారు పిలిచి నువ్వు ఆలస్యం గా వచ్చినా పర్వాలేదు, కొట్టను, లేటు అయ్యిందని మానేయ్యకు అని చాలా ముద్దు గా, ప్రేమ గా చెప్పారు. ఆనందమే ఆనందం. నేను యధేచ్చ గా వెళ్ళేదాన్ని. ఆయనేమో ఇచ్చిన మాట ఒక నాలుగురోజులు కూడా గుర్తు పెట్టుకోలేదు. గుర్తు వస్తుందన్న ఆశ తో ఆలస్యం అయినా నేను మాత్రం ఆ తర్వాత స్కూల్ మానేయ్యలేదు.

సాయంత్రం కధలు బాగా చెప్పేవారు ..పరీక్షలో తప్పితే మాత్రం సాయంత్రం ఇంకో గంట నిలబెట్టే వారు.అక్కడ అమ్మాయిలం మాత్రం అందరూ ఉండేవాళ్ళం, చదివితే కదా. అదీ కాక సినిమాలు తో పాటు  మాస్టారు గురించి కూడా చెప్పుకోవాల్సి వచ్చేసరికి టైం సరిపొయ్యేది కాదు . ఒక్కోసారి సాయంత్రం పనిష్మెంటు సెక్షన్ తప్పించుకోడానికి అమ్మ తలంటు పోస్తాను త్వరగా రమ్మని చెప్పింది అనగానే పంపించేసే వారు. తర్వాత రోజు తలంటు ఏది అంటారేమో అని ఇంకో టెన్షను :)

ఇలా ఒకరోజు మాస్టారు అలా మధ్యలో బయటికి వెళ్లాక, అమ్మాయిలం ముచ్చట్లు మొదలు,  శ్రీలక్ష్మి లా సినిమా టైటిల్స్ మొదలవుతాయి దగ్గర్నించి, ఏమి  మిస్సవ్వకుండా చెప్పేవాళ్ళం చూడని వాళ్ళకి.  ఆ రోజు సీత ఉన్నట్లుండి మాటల్లో 'నాకు రాత్రి కలలో  శ్రీనివాసరావు మాస్టారు వచ్చారు' అని చెప్పింది. ముందు కుంచెం షాక్ అయినా తేరుకొని అవునా ఏం జరిగింది చెప్పు చెప్పు అని ఒకటే అడగడం.....అది కాస్త చెబితే, మేము నెక్స్ట్ సీను ఊ హిం చే స్తూ బ్రతిమలుకోడం. చెప్పాలంటే మనసులో నేను తెగ బెంగ పెట్టేస్కున్నా :)..సరే అదేమో ఊరించి ఊరించి చెప్తూ అప్పుడేమయ్యిందంటే అని ఆగిపోయింది. సినిమాల్లో అయితే కచ్చితం గా సాంగ్ వచ్చే సీను అన్నమాట..మాకు అందరికీ వెలిగింది కాని చెపితే వినాలని ..అంతకంటే సిగ్గు మా సీతమ్మ కి ... ఇంకా నాకు అర్ధమైపోయింది నాకు ఈ పిల్ల కాంపిటీషను అని. మిగతా వాళ్ల గురించి నాకు అప్పట్లో అనుమానాలు లేవు :)

చదువులో కూడా  అందరం పోటి గా ఉండేవాళ్ళం, టెస్ట్ లు అవి పెట్టినపుడు. హోం వర్క్ బాగా చేస్తే నోట్ బుక్ లో సైన్ చేసే వారు . అలా ఆ రోజు ఎవరికి ఎక్కువ సంతకాలు మాస్టారు చేస్తే వాళ్ళకి చప్పట్లు..ఇంక ఆ రోజంతా వాళ్ళు స్పెషల్. మొదట్లో నాకు బాగా సంతకాలు పెట్టేవారు ..తర్వాత అబ్బాయిలు మాకు చెక్ పెట్టారనుకోండి ..నా మనసులో మాత్రం మాష్టారుకి నేనంటే నే అభిమానం అని మురిసిపోయ్యేదాన్ని..కాని నిజం నిప్పులాంటిది కదా. ఒక రోజు నాకు  ఇంకో షాక్ తగిలింది. ఏంటి అంటే, ఎప్పటిలానే టెస్ట్ పెట్టారు . 25 కి 8 మార్కులతో అంకమ్మ అనే అబ్బాయి క్లాస్ ఫస్టు..మిగతావాళ్ళు 5 కి అటు ఇటు అన్నమాట ..పంతుల్ గార్కి బాఘా  కోపం వచ్చింది. మాకు ఒక్కొక్కరికి 20 కన్నా ఎన్ని మార్కులు తక్కువ వస్తే వాళ్ళకి అన్ని దెబ్బలు అని నిర్ణయించేశారు. ఫస్ట్ వచ్చిన  అంకమ్మ సగర్వం గా వెళ్లి 12 దెబ్బలు తినేసాడు..నా టైం వచ్చింది, బెత్తం తో చెయ్యి పైన ఒక్కో దెబ్బకి , చెయ్యి దాచేసుకోడం. బ్రతిమిలాడుకోవడం వద్దండీ అని..అర్ధం చేసికోకుండా మొత్తం పూర్తి చేసారు. అందరికీ పక్క వాళ్ళని కొట్టేప్పుడు లెక్కపెడుతూ భలే ఆనందం :) అప్పుడే సీత వంతు మొదలయ్యింది ..16 దెబ్బలు, నాకన్నా ఒకటి ఎక్కువే అని నేను సంతోష పడేలోపలె అయిపోయాయి. ఒక్కసారి గుర్తు చేసికొంటే , ఆయన కొడుతూనే ఉన్నారు , ఈ పిల్ల చెయ్యి ఇంచు కూడా కదపకుండా ...అస్సల్ ఏడవకుండా ఆయన్నే చూస్తూ ఉంది. అంకమ్మ నా కన్నా ముందు తేరుకుని మాస్టారు సీతా మా లక్ష్మి ని అందరిలా గట్టిగ కొట్టలేదు అని ప్రశ్నించాడు. నిజమే, మా కన్నా కొంచెం చిన్న దెబ్బలు అన్నమాట. కాని గట్టిగానే కొట్టారు. మాస్టారు నవ్వుతూ సమాధానం చెప్పారు.మీలాగా కాదు ,ఆ అమ్మాయి చెయ్యి ఒక్కసారి కూడా వెనక్కి తీసికోలేదు అందుకే సీత కి చిన్న దెబ్బలు అన్నారు.
 
ఆ అబ్బాయి కేమి అర్ధం అయ్యిందో తెలిదు కాని..కాస్సేపు ఆలోచిస్తే నాకు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అంటారు కదా అలా అయ్యింది.ఎందుకంటె ఈ  పిల్ల అస్సలు నొప్పి అనకుండా ఎలా అన్ని దెబ్బలు తినేసింది. అంటే మాస్టారు మీద ప్రేమే కదా ... మరీ ఇంతలా పోటి పడాలంటే మనవల్ల అయ్యేపని కాదు అనిపించింది. బాధ గా అనిపించినా సీతా మా లక్ష్మి దీ నిజమైన ప్రేమ అని ఒప్పేసుకున్న మనసులో. అలాగని పూర్తిగా ప్రేమించడం మానేయ్యలేదనుకోండి ..ఈ లోగా హెడ్ మాస్టారు శ్రీనివాసరావు గారి ప్లేస్ లో ఇంకో టీచర్ ని పిలిపిస్తున్నట్లు చెప్పారు , అంటే ఈయన వెల్లిపోతారన్నమాట..చాలా బాధ అందరికీ , పాపం ఆ వచ్చే పంతులమ్మ ని మాకు వచ్చిన తిట్లు, శాపాలు అన్ని పెట్టేశాం ..వెళ్ళద్దు అని ఆయనికి కూడా చెప్పాం :) ...సరే ఈ సీత కి యెవ్వరికి రాని ప్రశ్నలు వస్తాయి. ఆ వచ్చే కొత్త టీచరమ్మ పేరు అడిగింది మాస్టారుని. సరే ఆయన నోటితో చెప్పొచ్చు కదా ...ఉహూ, చక్క గా సిగ్గు పడుతున్న ఈ పిల్ల అరచేతిలో పెన్నుతో 'శ్రీ లక్ష్మి' అని రాసేస్తిరి...ఈ చోద్యం ఎక్కడన్నా ఉందా. అంటే ఆయనికి కూడా బోల్డంత ప్రేమ అని రుజువైపోయింది :) ...ఇంకా మనం పూర్తి గా ఆశలు వదిలేసుకున్నా౦   అని వేరే చెప్పక్కరలేదు కదా.

తర్వాత సంవత్సరమే నేను,సీత  ఇద్దరం వేర్వేరు ఊర్లు వెళ్లి , మల్లి  హైస్కూల్ కి ఊరిలో కలిసాము.ప్రతి న్యూ ఇయర్ కి మాస్టారు కి  తప్పకుండ గ్రీటింగ్ కార్డు ఇచ్చి వచ్చేది..ఆయన కూడా వాళ్ల ఇంటిదగ్గరి అబ్బాయిలతో కార్డు పంపించేవారు. ఇద్దరం కలిసే కొనేవాళ్ళం చెరో కార్డు ..కానీ తనకి రిప్లై వచ్చింది కానీ మనకి వస్తుందా లేదా అన్న అనుమానం తో ఇవ్వడం మానేశా అన్నమాట. తర్వాత  సెవెంతు క్లాస్ కి వాళ్ల అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.తర్వాత నేను కూడా గురుకుల పాఠశాలా లో చేరాను.

నేను ఇంజనీరింగ్ కి  వచ్చాక ఒకసారి ఊరిలో ఫ్రెండ్స్ ని కలసినప్పుడు తెలిసింది , అప్పటికీ  శ్రీనివాసరావు మాస్టారు ఎవరైనా మా అమ్మాయిలు  ఎదురైతే మా సీతా మా లక్ష్మి కబుర్లు (ఎక్కడున్నది, ఏమి చదువుతుంది ) చెప్పేవారు  అని. అంత అభిమానం పొందిన సీత నిజం గా అదృష్టవంతురాలు. PG చదివింది అని తెలుసు, తర్వాత పెళ్లి కూడా వెంటనే అయిపొయింది ఇప్పుడు ఎక్కడున్నది తెలిదు. పిల్లా, పాపలతో చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను.

10, జనవరి 2011, సోమవారం

అందరికీ నమస్కారములు

అందరికీ నమస్కారములు

మరపురాని జ్ఞాపకాలు కొన్ని ఈ బ్లాగుద్వారా అందరితో పంచుకోవాలని కోరిక. చదవడమే కాని వ్రాయడం అలవాటు లేదు.,  చిన్నప్పటినుండీ చాల పుస్తకాలూ చదివాను, సాహిత్యం అని చెప్పబడే పుస్తకాలూ కూడా, ఎందుకంటె కనిపించిన ప్రతి పేపర్ చదివే అలవాటు వల్ల :)  వారెన్ బుఫేట్ చదివాకా, అసలు అందరూ వ్రాసింది ఒకటే అనిపిస్తుంది .తర్వాత  భగవద్గీత ని కొంచెమే చూసా, మరి  బుఫేట్ కూడా  భగవద్గీత చదివాడా వ్యాపార రహస్యాలకోసం అని పెద్ద అనుమానం :)        

నా వ్రాతలు కొంతమందికైనా నచ్చుతాయన్న  ఆశతో ..